Tuesday, June 28, 2011

విశ్వవిజేతగా భారత క్రికెట్ జట్టు అపూర్వం..చిరస్మరణీయం.

సుమారు మూడు దశాబ్దాల విరామం తర్వాత భారత క్రికెట్ జట్టు మరోసారి విశ్వవిజేతగా నిలవడం అపూర్వం. ఈ విజయం చిరస్మరణీయం. కుల, మత, ప్రాంతీయాది విభేదాలను మరచి భారత జాతి యావత్తు ప్రపంచకప్ ట్రోఫీని చూసి ఉప్పొంగిపోయింది. ఈ నెల 2వ తేదీ శనివారం శ్రీలంకపై ఆరు వికెట్ల తేడాతో టీమిండియా విజయభేరి మోగించిన మరుక్షణం ముంబయి వాంఖడే స్టేడియం హర్షధ్వానాలతో మారుమోగింది. బాణాసంచా వెలుగులో మెరిసిపోయింది. మువ్వనె్నల జెండా రెపరెపలాడుతూ మురిసిపోయింది. దేశమంతటా ఎక్కడ చూసినా అంబరాన్ని అంటిన సంబరాలే. ఏ మూలన విన్నా ‘జయహో భారత్’ నినాదాలే. చిన్నాపెద్దా అన్న తేడా లేకుండా కోట్లాది మంది అభిమానులు ఆనందంతో గంతులు వేశారు. ఆటపాటలతో జాగారణ చేశారు.
మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని భారత జట్టుకు ప్రపంచ టైటిల్‌ను సాధించే సత్తా నిజంగానే ఉందా? లేక లభించిన విజయాలన్నీ కాకతాళీయమేనా? డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా, హాట్ ఫేవరెట్ దక్షిణాఫ్రికా, పటిష్టమైన శ్రీలంక, అనూహ్యంగా చెలరేగి సంచలనాలు సృష్టించే పాకిస్తాన్ వంటి దిగ్గజాలు ఒకదాని తర్వాత మరొకటిగా నిష్క్రమిస్తే, ఏ శక్తి భారత్‌ను విజయతీరాలకు నడిపించింది? ఈ ప్రశ్నలకు ఒక్కొక్కరూ ఒక్కో రకంగా సమాధానం చెప్పవచ్చు. ఎవరి విశే్లషణలను వారు బహిర్గతం చేయవచ్చు. ఎవరి వాదనను వారు బలంగా వినిపించవచ్చు. కానీ, ఒక కష్టసాధ్యమైన పనిని టీమిండియా సుసాధ్యం చేసిందన్న విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవు. ఇది యావత్ జాతి పులకించాల్సిన తరుణమనడంలో మరో వాదనకు తావేలేదు. ఎందుకంటే, ధోనీ సేన సాధించింది ఆషామాషీ విజయం కాదు. గెల్చుకున్నది సామాన్యమైన ట్రోఫీ కాదు. తీవ్రమైన ఒత్తిడిని అధిగమించడం అనుకున్నంత సులభం కూడా కాదు. 1983లో కపిల్‌దేవ్ కెప్టెన్సీలో భారత జట్టు వరల్డ్ కప్ బరిలోకి దిగినప్పుడు ఎవరూ భారీ అంచనాలు పెట్టుకోలేదు. మీడియాలో ప్రచారం కూడా అంతగా లేదు. దూరదర్శన్‌ను మినహాయిస్తే అప్పట్లో చానెళ్లు ఇంతగా లేవు. అప్పటికే రెండు పర్యాయాలు వరల్డ్ కప్‌ను గెల్చుకున్న వెస్టిండీస్ జట్టు మరోసారి క్లెయివ్ లాయిడ్ నాయకత్వంలోనే వరుసగా మూడోసారి టైటిల్ అందుకొని ‘హ్యాట్రిక్’ సాధించడం ఖాయమని అంతా అనుకున్నారు. అంచనాలు ఏమాత్రం లేని కపిల్‌దేవ్ బృందం నుంచి అభిమానులు ఆశలు పెట్టుకోలేదు. ఏ ఒక్క మ్యాచ్‌ని గెలిచినా అది బోనసేనని ఆనందించారు. మీడియా దృష్టి అంతగా లేకపోవడం, ప్రజలు గొప్పగా ఏదీ ఆశించకపోవడం కపిల్‌సేనకు కలిసొచ్చిన అంశాలు. అందుకే ఏమాత్రం ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడింది. ఫైనల్‌లో వెస్టిండీస్‌తో తలపడినా, 183 పరుగులకే ఆలౌటైనా భారత్ తడబడలేదు. విండీస్‌ను ఓడించి, ‘క్రికెట్ మక్కా’ లార్డ్స్ మైదానంలో కొత్త అధ్యాయాన్ని సృష్టించింది.
కపిల్‌దేవ్ బృందంతో పోలిస్తే ధోనీ సేనపై ఒత్తిడి కొన్ని వందల రెట్లు పెరిగింది. బంగ్లాదేశ్, శ్రీలంక దేశాలతో పాటు ఈ టోర్నీకి భారత్ కూడా సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వడంతో, వేలాది మంది అభిమానుల సమక్షంలో మ్యాచ్‌లు ఆడడం కత్తిమీద సాము వంటిదే. గాయాల సమస్య కూడా ధోనీ సేనను వేధించింది. టోర్నమెంట్ ప్రారంభానికి ముందే ప్రవీణ్ కుమార్ గాయం కారణంగా వైదొలిగాడు. అతని స్థానంలో శ్రీశాంత్‌కు అవకాశం కల్పించారు. డాషింగ్ ఓపెనర్ వీరేందర్ సెవాగ్, ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రా పూర్తి ఫిట్నెస్‌తో లేరు. టోర్నమెంట్ ప్రారంభమైన తర్వాత హర్భజన్ సింగ్ వైఫల్యం కొనసాగింది. టాప్ ఆర్డర్ రాణిస్తే మిడిల్ ఆర్డర్ కుప్పకూలింది. మిడిల్ ఆర్డర్ బాగా ఆడితే, టాప్ ఆర్డర్ చేతులెత్తేసింది. బౌలింగ్, ఫీల్డింగ్ లోపాలు జట్టు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాయి. ఇన్ని సమస్యలతో సతమతమవుతున్నప్పటికీ, ‘మిస్టర్ కూల్’ ధోనీ ఎప్పటి మాదిరిగానే తడబడలేదు. అలసత్వాన్ని ప్రదర్శించలేదు. బ్యాటింగ్‌లో తాను స్వయంగా విఫలమైనప్పటికీ, మిగతా ఆటగాళ్లను ప్రోత్సహించాడు. సరైన సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకున్నాడు. ఫైనల్‌లో 91 పరుగులతో నాటౌట్‌గా నిలిచి, కెప్టెన్ ఏ స్థాయిలో ఆడాలో ప్రపంచానికి చాటి చెప్పాడు. ఒక్కమాటలో చెప్పాలంటే టీమిండియా సమష్టిగా పోరాడి విజయం సాధించింది. పట్టుదలతో అడుగులు వేస్తూ లక్ష్యాన్ని చేరింది. ఇంతటి చిరస్మరణీయ విజయాన్ని సాధించిన ధోనీ సేనపై ప్రశంసల జల్లు కురుస్తోంది.

క్రికెట్ ప్రధాన వార్తలు

మీ అందరికి నా సిక్సర్ ..

మీ అందరికి నచ్చేవిదముగా..మీకు  ఇష్టమైన విదముగా క్రికెట్ వార్తలు , సమాచారం ఇవ్వాలనేదే నా కోరిక..

ఎందుకంటే నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం..మీకు కూడా సరదాగానే ఉండేలా నా క్లిపింగ్స్ తప్పకుండ ఉంటాయి..

ఈ బ్లాగ్ లో క్రీడలు క్రికెట్ వార్తలు , క్రికెట్ వార్తలు, ఇండియన్ క్రికెట్ క్రికెట్, క్రీడా వార్తలు, మెల్బోర్న్ క్రికెట్ క్లబ్, క్రికెట్ యొక్క ప్రజాదరణ, క్రీడలు క్రికెట్ ఆటగాళ్ల ఫ్రొఫైల్ ఉంచుతాను

ఇట్లు మీ స్నేహితుడు ...హౌ ఇస్ దట్ ?


క్రికెట్ ప్రధాన వార్తలు

మీ అందరికి నా సిక్సర్ ..

మీ అందరికి నచేవిదముగా..మీకు ఇస్తామిన విదముగా క్రికెట్ వార్తలు , సమాచారం ఇవ్వాలనేదే నా కోరిక..

ఎందుకంటే నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం..మీకు కూడా సరదాగానే ఉండేలా నా క్లిపింగ్స్ ఉండేలా చూస్తాను..

క్రీడలు క్రికెట్ వార్తలు , క్రికెట్ వార్తలు, ఇండియన్ క్రికెట్ క్రికెట్, క్రీడా వార్తలు, మెల్బోర్న్ క్రికెట్ క్లబ్, క్రికెట్ యొక్క ప్రజాదరణ, క్రీడలు క్రికెట్ ఆటగాళ్ల ఫ్రొఫైల్, క్రికెట్ ప్రధాన వార్తలు

ఇట్లు మీ స్నేహితుడు ...హౌ ఇస్ దట్ ?